అడుక్కోవడం తప్పు కాదని.. ఇటీవల కొన్ని సినిమాలు సందేశం ఇస్తూ వస్తున్నాయి. బెగ్గర్లను హీరోలుగా చూపించడం ప్రారంభించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అడుక్కోవడం కన్నా ఘోరమైన పని లేదని చెప్పి నిషేధం విధించేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం ఏపీలో అడుక్కోవడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకు వచ్చింది. ఇది అమల్లోకి వచ్చేసింది. అడుక్కుంటూ దొరికితే మొదటి సారి పునరావాస కేంద్రానికి తరలిస్తారు. అక్కడి నుంచి వచ్చాక మళ్లీ అదే పని చేస్తూ దొరికిపోతే జైలుకు పంపుతారు.
బెగ్గింగ్ సామాజిక సమస్య
బెగ్గింగ్ సామాజిక సమస్యగా ప్రభుత్వం గుర్తిచింది. దాన్ని రూపు మాపాల్సిన అవసరాన్ని గుర్తించింది. అందుకే.. చట్టం తీసుకు వచ్చింది. ఇది బెగ్గర్లను శిక్షించే ఉద్దేశంతో కాకుండా.. వారిని సంస్కరించే లక్ష్యంతో చట్టం చేశారు. అడుక్కునేవారి స్థితిగతుల్ని పరిశీలించి వారికి పునరావాసం కల్పిస్తారు. పని చేసుకోగలిగేవాళ్లను ఆ దిశగా పంపిస్తారు. పని చేసుకోలేని వాళ్లను ప్రభుత్వమే పోషిస్తుంది. కానీ అడుక్కోవడానికి మాత్రం అవకాశం ఇవ్వరు.
మాఫియా ముఠాల్ని అరికట్టడమే ముఖ్యం
నిజానికి ఏమీ లేక అడుక్కునే వారు తక్కువగా ఉంటారు. ప్రతీ చోటా ఓ బెగ్గింగ్ మాఫియా ఉంటుంది. అనాథల్ని, అభాగుల్నిచేర దీసి.. వారిని అడుక్కోవడానికి పంపిస్తారు. ఆ డబ్బులన్నీ మాఫియాకు చేరుతాయి. ఈ బెగ్గర్లకు తిండి మాత్రమే పెడతారు. ఇలాంటి ముఠాలు చాలా ఉన్నాయి. అందుకే వీటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఈ తీసుకు వచ్చింది. గవర్నర్ ఆమోదించడంతో అమల్లోకి వచ్చింది. ఇప్పటికి మన దేశంలో ఇరవై రెండు రాష్ట్రాల్లో అడుక్కోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ముందుగా పునరావాస సౌకర్యాలను ఏర్పాటుచేయాలి !
అయితే చట్టాలు చేయడం వల్ల.. శిక్షలు వేస్తామని భయపెట్టడం వల్ల బెగ్గింగ్ అనే దాన్ని రూపుమాపలేరని సామాజికవేత్తలు చెబుతున్నారు. బెగ్గర్లు అసలు ఎందుకు అలాంటి పని చేస్తున్నారో తెలుసుకుని.. వారిని సంస్కరించే ప్రయత్నం చేసినప్పుడే ఫలితం వస్తుందని అంటున్నారు. ప్రభుత్వాలు హడావుడిగా చట్టాలు చేయడం కాదని.. ముందుగా బెగ్గర్ల రీహాబిలిటేషన్ కు అవసరమైన చర్యలు తీసుకున్న తర్వాత అమలు ప్రయత్నం చేయాలని అంటున్నారు. మరి ప్రభుత్వం అలకిస్తుందో లేదో.
