రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో మాత్రం చాలా పవిత్రత పాటించేవారు. రాజకీయంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఎవరూ దేవుడి జోలికి వెళ్లేవారు కాదు. ఏమైనా చేయగలిగితే కేవలం దర్శనం టిక్కెట్లు, వీఐపీలతో పరిచయాలు పెంచుకుని ఇతర అవసరాలు తీర్చుకునే పని చేసుకునేందుకు అక్కడ పదవులు పొందిన వారు ప్రయత్నించేవారు తప్ప.. నేరుగా దేవుడ్ని దోచుకుందాం.. పవిత్రతను దెబ్బతీద్దాం అనుకున్నవారు లేరు. మొదటి సారిగా వైసీపీ హయాంలో ఐదు సంవతర్సాల పాటు ఇది నిరాటంకంగా సాగింది.
నెయ్యే కాని నెయ్యిని ప్రసాదంలో వాడి డబ్బులు సంపాదించాలని ఎలా అనిపించింది?
లడ్డూ తయారీకి సరఫరా చేస్తోంది నెయ్యికాదని వైవీ సుబ్బారెడ్డికి తెలుసు. టెండర్ల నిబంధనలు మార్చి భోలేబాబాకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఎప్పుడైనా దొరికిపోతామని చెప్పి.. అప్పుడప్పుడు ట్యాంకర్లలో క్వాలిటీ లేదని చెప్పి.. కొన్ని తిరస్కరించి మళ్లీ వాటిని వేరే కంపెనీల పేర్లతో తీసుకున్నారు. ఆయా కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నారు. దేవుడి ప్రసాదం అంటే భక్తులకు ఓ ఎమోషన్.దాన్ని ఎలా కల్తీ చేయాలని అనిపించిందో.. ఆ డబ్బుతో ఎలాంటి సుఖాలు పొందాలనుకున్నారో కానీ.. దేవుడిపైనే కుట్రలు చేశారని మాత్రం అర్థమైపోతుంది.
హుండీ దొంగనే దోపిడీ చేశారు కదా- దొంగలకే దొంగలు!
మరో వైపు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి పరకామణిలో ఏళ్లతరబడి పని చేస్తూ విదేశీ కరెన్సీ ఎత్తుకెళ్తున్నాడు. ఎలా ఎత్తుకెళ్తూ ఓ సారి దొరికాడు. దొరికినప్పుడు ఏం చేయాలి? భక్తుల సొమ్ము ఎంత మేరు దోచుకెళ్లాడో మొత్తం స్వాధీనం చేసుకుని కేసులు పెట్టాలి. కానీ ఆ దొంగను పట్టుకుని కొంత టీటీడీకి రాయించి మిగతా ఆస్తులన్నీ తాము రాయించుకుని రాజీ చేసి వదిలేశారు. అంటే శ్రీవారి కానుకల్ని దొంగతనం చేసిన వారిని ఈ దొంగలు దోపిడీ చేసి వదిలి పెట్టారు. అంటే వీళ్లు దొంగలకే దొంగలు.
టిక్కెట్లు సహా సివిల్ టెండర్ల వరకూ విజిలెన్స్ రిపోర్టులో అన్నీ!
ఇవి మాత్రమేనా.. టీటీడీని ఎంత అడ్డగోలుగా దోచుకోవాలో అన్నీ దోచుకున్నారు. టిక్కెట్లు కోటా పెట్టుకుని మరీ పంచుకుని అమ్ముకున్నారు. రోజా నుంచి పెద్దిరెడ్డి వరకూ చేసిన దందాలన్నీ బయటకు వచ్చాయి. చివరి ఏడాది పట్టుబట్టి టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి తన కొడుకును గెలిపించడానికి టీటీడీ నిధుల్ని ఇంధనంగా వాడుకున్నారు. సివిల్ పనులకు టెండర్లు ఖరారు చేసి.. కమిషన్లు తీసుకున్నారు. చివరికి కుమారుడు గెలవలేదు కానీ దేవుడు సొమ్ము మాత్రం స్వాహా చేశారు. ఇవి మాత్రమే కాదు.. టీటీడీ విజిలెన్స్ నివేదికలో ఇంకా చాలా ఉన్నాయి. బయటకు రావాల్సి ఉంది.
దేవుడ్ని ఇలా దారుణంగా దోచుకున్నవారి పాపం ఎప్పటికైనా పండుతుంది. వారిని దేవుడు క్షమిస్తాడని అనుకోలేం. కర్మ ప్రకారం జరగాల్సింది జరిగి తీరుతుంది.
