అమరావతికి లక్ష కోట్లు అప్పు చేస్తున్నారని ఒక వైసీపీ నేత వచ్చి బాధపడిపోతారు.. మరో తెల్లగడ్డం పెద్దాయన వచ్చి ఇప్పటి వరకూ అమరావతిలో చంద్రబాబు ఏం కట్టారని అంటారు.. ఇంకొకడు వచ్చి అమరావతి మునిగిపోయిందని పోస్టులు పెడతారు. ఇప్పుడు అమరావతి మీద ఎందుకిలా … వైసీపీ బీపీ తెచ్చుకుంటోందని .. ఆరా తీస్తే.. అసలు విషయం.. అక్కడ పనులు ఇరవై నాలుగు గంటలూ జరుగుతూండటమే. వైసీపీ నేతలు కుళ్లుకునేలా.. వారి కడుపు మండిపోయేలా.. అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. .
13వేల మంది నిరంతర శ్రమ
అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిరంతరం జరుగుతున్న పనులే కనిపిస్తున్నాయి. కాంట్రాక్టులు పొందిన అన్ని సంస్థలు.. మ్యాన్ పవర్ ను రంగంలోకి దింపారు. అత్యాధునిక టెక్నాలజీతో శరవేగంగా పనులు చేసేలా…నిపుణుల్ని రంగంలోకి దించారు. ఇప్పుడు అక్కడ ఫ్లడ్ లైట్ల వెలుతురులోనూ పనులు జరుగుతున్నాయి. పదమూడు వేల మంది తమ చెమటను చిందిస్తున్నారు. గతంలో పునాదులు పడిన అమరావతిని ఆపేశారు. ఇప్పుడు ఆ పునాదుల మీదనే కట్టేస్తున్నారు. అందుకే శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.
భూములు పొందిన సంస్థల పనులూ షురూ !
ప్రభుత్వ పనులే కాదు.. భూములు పొందిన కంపెనీలు, విద్యా సంస్థలు, హోటళ్లు కూడా తమ నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. బసవతారకం ఆస్పత్రి సహా ఎన్నో సంస్థలు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించాయి. చంద్రబాబు ఇంటి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ప్రభుత్వం యాభై వేల కోట్ల రూపాయల పనులు చేయిస్తూంటే.. ప్రైవేటు ఇన్వెస్టర్లు మరో యాభై వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభించారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల హడావుడి కూడా ప్రారంభమయింది. దీంతో ఇప్పుడు అమరావతిలో లక్ష కోట్లకుపైగా పనులు జరుగుతున్నాయి. అభివృద్ధిని, సంపద సృష్టిని ఏ మాత్రం ఓర్చుకోని వైసీపీ నేతలు… అందుకే గగ్గోలు పెట్టడం ప్రారంభించారు.
విజిబుల్ అభివృద్ధి !
ఇంటి ముందు ఉన్న చెట్టును రోజూ చూస్తూంటే.. ఎంత పెరిగినా పెరిగినట్లు అనిపించదు. కానీ ఒక్క సారిగా ఆరు నెలల తర్వాత చూస్తే ఇంత పెరిగిపోయిందా అని ఆశ్చర్యపోతాం. అలాగే ఐదు సంవత్సరాల పాటు ఎక్కడ ఉందో అక్కడే ఉన్న అమరావతి.. ఆరు నెలల్లోనే రూపు మారిపోయి కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సీఆర్డీఏ బిల్డింగ్ పూర్తి అయింది..ఉద్యోగాల భవనాలకు పెయింటింగ్ వర్క్ జరుగుతోంది. వచ్చే మార్చికల్లా.. అమరావతిలో గతంలో సగం పూర్తయిన భవనాలన్నింటినీ పూర్తి చేస్తారు. మూడేళ్లలో అమరావతి ప్రపంచస్థాయి నగరాల ప్రమాణాలతో అందుబాటులోకి వస్తుంది. ఈ విషయం అర్థమైపోయే.. వైసీపీ నేతలు కడుపు మాడ్చేసుకుంటున్నారు.
