చిత్రసీమ ఎప్పుడూ విజయాల చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. ఓ హిట్ సినిమా వస్తే చాలు.. హీరో, హీరోయిన్లతో పాటు అందరూ బిజీ అయిపోతారు. అడ్వాన్సులు అందుతుంటాయి. కొత్త సినిమా కబుర్లు వినిపిస్తుంటాయి. నిర్మాతలు నటీనటులు, టెక్నీషియన్ల డేట్ల కోసం కుస్తీలు పడుతుంటారు. ఇలాంటి వాతావరణం కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటుంది. తాజాగా టాలీవుడ్ లో అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ప్రస్తుతం టీ – టౌన్ లో అడ్వాన్సుల సీజన్ నడుస్తోంది.
‘లిటిల్ హార్డ్స్’ తో ఇండస్ట్రీకి ఓ ఊపు వచ్చింది. ఎప్పుడైనా చిన్న సినిమా బాగా ఆడితే ఆ కిక్కే వేరు. ఓ చిన్న సినిమా ఆడితే… కనీసం వంద మంది నిర్మాతలు కొత్త ఉత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. లిటిల్ హార్ట్స్ అలాంటి పాజిటీవ్ వైబ్రేషన్ తీసుకొచ్చింది. ఈ సినిమాతో హీరోగా మారాడు మౌళి. తన చేతి నిండా సినిమాలే ఉన్నాయిప్పుడు. రిలీజ్ రోజు నుంచి ఈ రోజు వరకూ మౌళికి నిర్మాతల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన సాయి మార్తాండ్ పంట కూడా పండింది. సినిమా సెట్స్ పై ఉండగానే జగపతిబాబు అడ్వాన్స్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక… ఓ పెద్ద నిర్మాణ సంస్థ తనతో సినిమా చేయడానికి ముందుకొచ్చింది. బన్నీ వాస్ కూడా అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం. కనీసం ఐదుగురు నిర్మాతలు ఈ దర్శకుడికి అడ్వాన్సులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన సింజిత్ కూడా నిర్మాతల దృష్టి లో పడ్డాడు. తాను కూడా బిజీ అయిపోయాడు.
ఇక ‘మిరాయ్’ వంతు. ఈ సినిమాతో తేజా పాపులారిటీ మరింతగా పెరిగింది. తను ప్రస్తుతం ‘జాంబీరెడ్డి 2’ చేయబోతున్నాడు. ఈలోగా బాలీవుడ్ నుంచి ఓ ఓపెన్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలు మరిన్ని తేజాతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. మంచు మనోజ్ కూడా విలన్ గా బిజీ అవ్వబోతున్నాడు. పెండింగ్ లో ఉన్న తన సినిమాలు ఒకొక్కటిగా పట్టాలెక్కబోతున్నాయి. ‘కిష్కింధపురి’ యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయినా దర్శకుడు కౌశిక్‌కి మరో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో విలన్ గా చేసిన శాండీ మాస్టర్ కూడా బిజీ అవ్వబోతున్నాడు. ‘కోర్ట్’ దర్శకుడు ఇప్పటికే నానితో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమాలో నటించిన రోషన్, శ్రీదేవి కూడా బిజీ అయిపోయారు. వీరిద్దరితో కోన వెంకట్ ‘బ్యాండ్ మేళం’ అనే సినిమా పట్టాలెక్కించారు. ఇది కాకుండా రోషన్ చేతిలో నాలుగు సినిమాలున్నట్టు తెలుస్తోంది.
