జగన్ రెడ్డి రెండున్నర గంటల ప్రెస్‌మీట్ పెట్టి నటనాకౌశలం ప్రదర్శించారని ఆయన చెప్పేది వినలేక… జర్నలిస్టులు విసుగుచెంది ఉంటారని ఈ వారం కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బాధపడ్డారు. జగన్ రెడ్డి మాటలకు తలాతోకా ఉండవని చెబుతూనే .. తన వారాంతం అరగంట సమయాన్ని జగన్ ప్రెస్‌మీట్ కోసమే కేటాయించారు. విచిత్రం ఏమిటంటే జగన్ రెడ్డి ప్రెస్ మీట్లను జనం పట్టించుకోవడం మానేశారు. ఆయన చెప్పే మాటల్లో నిజాలు ఉండవని.. ఓ క్లారిటీ ఉంది. సాక్షి పత్రికలో వచ్చిన వార్తల్నే మీడియా ముందు చెప్పమని సజ్జల లాంటి వాళ్లు రాసిస్తారు. ఆయన చదువుతారు. అందులోనూ ట్రోలింగ్ స్టఫ్ ఉంటుంది. అయితే ఆయన ప్రెస్‌మీట్ తలనొప్పి అంటూనే ఆర్కే ప్రాధాన్యమివ్వడం మాత్రం ఆశ్చర్యకరం.
ఆర్కే ఈ వ్యాసంలో జగన్ రెడ్డి అన్న ఓ మాటను సీరియస్ గా తీసుకుని.. సీరియస్‌గా తీసుకోకూడదని చెప్పుకొచ్చారు. ఆ మాట ఏమిటంటే….హామీలు అమలు చేయలేదని చంద్రబాబు, పవన్,లోకేష్‌లను బొక్కలో వేయాలని జగన్ అన్నారట. దాన్ని ఆర్కే ఖండించిన విధానం చాలా తేడాగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే ప్రధాన హామీలు అమలు చేసింది. జగన్ రెడ్డి హయాలో కన్నా మెరుగైన పథకాలు అందిస్తోంది. అన్నింటికి మించి లా అండ్ ఆర్డర్, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో జరిగే చర్చలు అంతా అవినీతి, అక్రమాలు, దోపిడీ అయితే .. ఇప్పుడు అంతా పెట్టుబడులు,ఉద్యోగాల గురించే చర్చ. దాన్ని ఆర్కే చెప్పకుండా.. దేశంలో అందరూ నేతల్ని అలా అయితే జైల్లో పెట్టాలని..జగన్ రెడ్డిని కూడా పెట్టాలని మద్యనిషేధం హామీ గురించి చెప్పుకొచ్చారు.
జగన్ రెడ్డి ప్రెస్‌మీట్ లో బీసీ అధికారుల్ని వాడూవీడూ అన్నాడని… ఆర్కే చెప్పుకొచ్చారు. అవి మాటలే.. కానీ దళితుల్ని పావులుగా వాడుకుని వారికి చేసిన అన్యాయాలు చేతలు. బీసీ అధికారుల్ని బలి చేసిన ఆయన చర్యలు ఇంకా కళ్ల ముందే ఉన్నాయి. ఆ వర్గాలను పావులుగా వాడుకుని తన అవినీతి సంపాదన ..మానసిక వ్యాధి సంతృప్తికి బలి చేశారు. అవన్నీ ఆర్కేకు గుర్తు లేవు. గుర్తు చేసే ప్రయత్నం చేయలేదు. దేవుడి సొమ్ము విషయంలో జగన్ రెడ్డి చేసిన దాన్ని కూడా సరైన రీతిలో ఎక్స్ పోజ్ చేయకుండా.. నేతలెవరూ లేరు.. ముగ్గురు పోలీసు అధికారులు రవికుమార్ ను బెదిరించారని చెప్పుకొచ్చారు. అసలు పై స్థాయిలో జోక్యం లేకుండా పధ్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని టీటీడీకి రాసిచ్చి..కేసు రాజీ అనేది సాధ్యమేనా?. శ్రీవారి సొమ్మును ఆశపడిన వాడి..తన ఆస్తిని రాసిస్తాడా?. లాంటి సందేహాలు ఆర్కేకు రాలేదు. జనరలైజ్ చేసి.. చిన్నది చేద్దామన్న ప్రయత్నమే కనిపించింది.
అయితే ఇక్కడ ప్రత్యేకత ఉంది.. అదేమిటంటే.. లిక్కర్ కేసు నిందితుడు అయిన చెవిరెడ్డి.. జగన్ నే మోసం చేసి వందల కోట్లు సంపాదించుకున్నారన్న విషయం బయటపడిందట.. అందుకే పట్టించుకోవడంలేదని ఆర్కే అంటున్నారు. చెవిరెడ్డి నొక్కేసినా.. నొక్కేయకపోయినా ఆయనను అలా వదిలేస్తే చివరికి దొరికేది తానేనని జగన్ కు తెలియదా?. కారణం ఏమిటో కానీ లిక్కర్ కేసు నిందితుల్ని జగన్ దగ్గరకు రానివ్వడంలేదు. మిథున్ రెడ్డిని కూడా. చివరికి పరామర్శ కూడా లేదు. ఈ వ్యూహమేమిటో .. ఆర్కే విశ్లేషించాల్సింది పోయి.. చిన్న పిల్లల నేరేటివ్స్ తో కొత్తపలుకులు నింపారు.

