వైకాపా అధ్యక్షుడు రిషికేశ్ వెళ్లి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో గంగలో మునిగి ఆ తరువాత ఆయన చేస్తున్న హోమంలో కూడా పాల్గొన్నారు. హోదా కోసం గంగలో స్నానం, యాగం అంటూ సాక్షి దానికి మంచి కవరేజ్ కూడా ఇచ్చింది. మిగిలిన పత్రికలు, న్యూస్ ఛానళ్ళు కూడా జగన్ గంగా స్నానం, రిషికేశ్ లో పూజాపునస్కారాల వార్తలు, ఫోటోలతో న్యూస్ కవరేజ్ ఇచ్చేయి కనుక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ విషయం బాగానే చేరిందని చెప్పవచ్చు.
గంగలో ములిగితే ప్రత్యేక హోదా వచ్చేస్తుందనుకొంటే ఆపని ఎప్పుడో చేసి ఉండవచ్చు. ఇకపై దానికోసం ఉద్యమాలు చేయనక్కరలేదు కూడా. కానీ ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని మళ్ళీ ఆయనే చెపుతుంటారు. అంటే గంగలో ములిగినా హోదా రాదని ఆయనకీ తెలుసన్నమాట. మరి ఈ హడావుడి ఎందుకు చేస్తున్నట్లు? క్రీస్టియన్ మతాన్ని పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి హిందూమతాచారాల ప్రకారం పూజలు పునస్కారాలు ఎందుకు చేస్తున్నారు? ప్రత్యేక హోదా కోసమే అంటే వైకాపా నేతలు కూడా నమ్మరు. మరి ఎందుకు చేస్తున్నారు అంటే తాను లౌకికవాదిని.. వైకాపా లౌకిక పార్టీ అని చెప్పుకొని రాష్ట్రంలో హిందూ ఓటర్లని ఆకట్టుకోవడానికేనని అనుమానించవలసి ఉంటుంది.
జగన్ ఒక్కరే కాదు మన రాజకీయ ప్రముఖులు అందరూ సమాజంలో వివిధ మతస్తులని, కులస్తులని, వర్గాల ప్రజలని ఆకట్టుకోవడం కోసం ఇటువంటి జిమ్మికులు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. నమాజ్ చేయడం తెలియకపోయిన ముస్లింలతో కలిసి నమాజులు చేస్తున్నట్లు నటించడం, దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయడం వంటి జిమ్మికులన్నీ ఈ కోవలోకే వస్తాయి.
నిజానికి తాము పాటించని, నమ్మకంలేని మతాచారాలని అనుకరిస్తున్నట్లు నటించడమే మహా పాపం. ఆ వర్గాన్ని అవమానించినట్లు భావించవలసి ఉంటుంది. కానీ ఈరోజుల్లో ఏమి చేస్తే ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయో ఏమి చేస్తే ఫ్లాట్ అయిపోతారో ఎవరికీ తెలియదు కనుక రాజకీయ నేతలు ఇలాగ నాలుగు వైపులా నాలుగు రాళ్లు విసురుతో జనాలని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
కనుక గంగా, గోదావరి నదులలో మునిగిన జగన్మోహన్ రెడ్డి రేపు కృష్ణమ్మలో కూడా మునగడం ఖాయం. అయితే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్ననే ప్రత్యేక హోదాకి బదులు ఏపికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వబోతున్నట్లు మీడియాకి చెప్పేశారు. కనుక ఏ గంగలో మునిగినా ప్రత్యేక హోదా రాకపోయిన కొందరు జనాలు మాత్రం చాలా ఇంప్రెస్ అవుతారు. ప్రత్యేక హోదా ఇవ్వమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మళ్ళీ నిన్న మరోమారు చెప్పేశారు కనుక పుష్కరాలు పూర్తవ్వగానే జగన్ దానికోసం ఉద్యమాలు మొదలుపెడతారేమో?
