కాశ్మీర్ గత నెలరోజులుగా రావణకష్టంలా రగులుతోంది. దానిని పాక్ ప్రభుత్వమే రగిలిస్తోందని భద్రతాదళాలకి పట్టుబడ్డ లష్కర్ ఉగ్రవాది బహదూర్ అలీ స్పష్టం చేశాడు. అతనే కాదు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా కాశ్మీర్ లో అల్లర్లని స్వాతంత్ర్య సమరంగా వర్ణించి దానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కనుక కాశ్మీర్ అల్లర్లలో పాక్ ప్రమేయం ఉందా లేదా అని పరిశోధించే శ్రమ కూడా తప్పింది.
ఒక ఉగ్రవాది బుర్హాన్ వనీని ఎన్కౌంటర్ చేస్తే అందుకు బదులుగా 52మందిని బలి చేసుకోవలసిరావడం చాలా దురదృష్టకరమే. అందుకు పాకిస్తాన్ని వేర్పాటువాదులనే కాదు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీని, కేంద్రప్రభుత్వాన్ని కూడా నిందించక తప్పదు. కాశ్మీర్ లో ఇటువంటి సమస్య మొదలైతే అది చివరికి ఎంతవరకు వెళుతుందో గతంలో చాలాసార్లు అందరూ చూశారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతానుభవాల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. సకాలంలో అప్రమత్తం అవలేదు. అందుకు కాశ్మీర్ బారీ మూల్యం చెల్లించింది.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా చేతులు ఎత్తేసి, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరిన తరువాతే, ప్రతిపక్షాలు గట్టిగా ఒత్తిడి చేసిన తరువాతే ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడారు. ఈ నెల 12న అంటే రేపు డిల్లీలో అఖిలపక్షం నిర్వహించడానికి అంగీకరించారు. ఆ సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయలు, సూచనలు, సలహాల మేరకు కాశ్మీర్ లో దిద్దుబాటు చర్యలు చేపడతారు.
ఆ రాష్ట్రంలో మితవాదులతో చర్చలు జరపడానికి కేంద్రప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేయడం మరో ఆసక్తికర పరిణామం. కాశ్మీర్ లో ఎప్పుడు అల్లర్లు చెలరేగిన ఇంచుమించు ఇదే పద్దతిలో పరిష్కరిస్తుంటారు. కనుక ఈసారి కూడా అదే పద్దతిలో కేంద్రం ముందుకు వెళ్లబోతోంది. కానీ ఇదేపని రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లు మొదలిన వెంటనే చేసి ఉండి ఉంటే పరిస్థితి ఇంత విషమించేదే కాదు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో భాజపా కూడా భాగస్వామిగా ఉన్నందున ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీకి ఆగ్రహం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం కాశ్మీర్ సమస్యని పట్టించుకోకుండా ఉండటం కూడా సరికాదు. అందరూ చేసిన పొరపాట్లకి కాశ్మీర్ ప్రజలు మూల్యం చెల్లించవలసి వచ్చింది.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టడం మంచిదే కానీ కాశ్మీర్ సమస్యని సజీవంగా ఉంచాలని భావిస్తున్న పాకిస్తాన్ దుష్ట పన్నాగాలని కూడా అడ్డుకోవలసి ఉంటుంది. పాక్ ప్రభావం నుంచి కాశ్మీర్ ప్రజలని బయటకి రప్పించే ప్రయత్నాలు చేయాలి. అంతకంటే ముందుగా ప్రజలకి మార్గదర్శనం చేయవలసిన నేతలే తమ వైఖరి మార్చుకోవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో సహా ఆ రాష్ట్ర రాజకీయ నేతలు తమ పాక్, వేర్పాటువాదుల అనుకూల వైఖరిని వదిలించుకొని కాశ్మీర్ ఎప్పటికీ భారత్ దే అని అంగీకరించి అదే విషయం ధైర్యంగా కాశ్మీర్ ప్రజలకి కూడా అర్ధమయ్యేలా నచ్చజెప్పల్సి ఉంటుంది. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొంటూ పాక్ దుష్టపన్నాగాలని అడ్డుకోవడం కూడా చాలా అవసరం. అప్పుడే కాశ్మీర్ లో ఇటువంటి అల్లర్లు పునరావృతం కాకుండా ఉంటాయి.
