టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రవాసాంధ్రులు అండగా నిలిచారని, తమ కుటుంబానికి వారు కొండంత బలమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో వేలాది మంది తెలుగు ప్రజలను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు. చంద్రబాబును అక్రమ కేసులతో గత ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసాంధ్రులు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. క్లిష్టసమయంలో పార్టీకి , తమ కుటుంబానికి అండగా నిలిచిన NRI లను Most Reliable Indians – MRIsగా అభివర్ణించారు.
వై నాట్ 175 అంటూ ఊదరగొట్టిన వైసీపీ వై నాట్ 11కు పరిమితం అయిందని, కూటమికి 164సీట్లు దక్కాయని ఈ విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర మరవలేనిదని ప్రశంసించారు లోకేష్. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీని అభివృద్ధిలో పట్టాలెక్కిస్తూ తిరిగి గాడిన పడుతున్నామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ఏపీ స్పీడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తోందని అన్నారు.
20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా , ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇక , విదేశాల్లోని తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు లోకేష్. అలాగే, రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. చట్టపరంగా చర్యలు ఉంటాయని , తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
