బాలకృష్ణ అఖండ సినిమా ఆగిపోయింది. అద్భుతమైన బజ్ ఉన్న సినిమా. టేబుల్ ప్రాఫిట్స్ చూసిన సినిమా.. ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయిదంటే ఆ నిర్మాతలు ఎంత ఘోరమైన ఆర్థిక ప్రణాళికలతో ఉన్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోవడంపై రాజకీయంగానూ చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇలాంటి సమస్య ఎదురయితే పరిష్కరించుకున్నారని..కానీ బాలకృష్ణ సినిమాకు పరిష్కరించలేదని అంటున్నారు. ఇక్కడ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. సినిమా చేసినంత మాత్రాన .. విడుదల చేసుకోవాలంటే.. ఆ నిర్మాతల పాతబాకీలన్నీ హీరోలు తీర్చాలా?
నిర్మాతలది నిర్లక్ష్యంతో కూడిన మోసం
ఈరోస్ అనే సంస్థతో లావాదేవీలు చేశారు. తప్పులు జరిగాయి. డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఆదేశాలు ఉన్నాయి. కానీ అన్నింటిని దాచి పెట్టుకున్నారు. ఆరేడేళ్ల కిందటివి అవి. ఇప్పుడు సినిమా విడుదలయ్యే సమయంలో అన్నీ వచ్చి అడ్డం పడ్డాయి. ఇప్పుడు చేసిన సినిమాకు లాభాలు వచ్చాయి. కానీ పాత బాకీలు చెల్లించలేదు. ఫలితంగా అడ్డం పడ్డాయి. వారిని నమ్మి ఇంకెవరూ ఆ డబ్బు చెల్లించడానికి ముందుకు రాలేదు. అంత పలుకుబడి వారు సంపాదించుకున్నారు. దానిక ఎవరేం చేస్తారు?. బాలకృష్ణ బాగుపడతారని డేట్స్ ఇచ్చారు. బోయపాటి అంతే. ప్రమోషన్లు కూడా పాన్ ఇండియా స్థాయిలో చేశారు. వాటిని ఉపయోగించుకుని లాభాలు పొంది ఆ నిర్మాతలు బయటపడాలి కానీ ఇలా రోడ్డున పడతారా?
పవన్ కల్యాణ్ వల్ల సినిమా ఆలస్యం.. అందుకే బాధ్యత తీసుకున్నారు!
పవన్ కల్యాణ్ సినిమాను రిలీజ్ చేయించుకున్నారని.. రత్నం ఆర్థికకష్టాలను తీర్చడానికి రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చారని చెప్పుకున్నారు. అయితే ఆ సినిమా ఐదు సంవత్సరాల పాటు షూటింగ్ జరిగింది.దానికి కారణం పవన్ కల్యాణేనని..ఆయనే చాలా సార్లు చెప్పారు. రత్నం ఎంతో ఓపికగా సినిమాను పూర్తి చేశారన్నారు. ఆర్థికంగా కూడా ఒత్తిడికి గురయ్యారన్నారు. పవన్ తన వల్ల ఆలస్యం జరిగింది కాబట్టి తాను అండగా ఉండాలని ముందుకు వచ్చారు. అంతే కానీ.. తాను అన్ని విధాలుగా సహకరించి.. చివరికి అతని పాత బాకీలు కూడా తీర్చి..తన సినిమా విడుదల చేసుకోవాల్సిన అవసరం వస్తే..ఆయనైనా ఆలోచిస్తారు. ఎందుకంటే సినిమా అనేది వ్యాపారమే కానీ..ధార్మిక పని కాదు.
హీరోలదే అంతా బాధ్యత అంటే సొంత సినిమాలే తీసుకుంటారుగా !
నిర్మాతల పాత బాకీలు కూడా హీరోలు చూసుకుని తన సినిమాలు విడుదల చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే…హీరోలు ఇక ఇతర బ్యానర్లలో చేయాల్సిన అవసరం ఏముంది ?. తామే సొంత సినిమాలు తీసుకుని ఆ వచ్చే డబ్బులు తమ ఖాతాలోనే వేసుకుంటారుగా . సినిమా బడ్జెట్ లో చాలా వరకూ హీరో రెమ్యూనరేషన్ ఉంటుంది. కానీ అభిరుచి ఉన్న నిర్మాతలు సినిమాలు చేస్తే.. వచ్చే ఎఫెక్ట్ వేరు. అందుకే బయట నిర్మాతలకు హీరోలు చే్తారు. అంత మాత్రాన సినిమా ఆగిపోతే హీరోను నిందిస్తే.. ఇక నిర్మాతలెందుకు?
