గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా అవుతోంది వైసీపీ పరిస్థితి. పరాకామణి చోరీ కేసు చాలా చిన్నదంటూ జగన్ రెడ్డి చెప్పడంతో అంతా చర్చ జరుగుతోంది. దీంతో వెంటనే ఇప్పటి వరకూ మీడియాకు ముఖం కూడా చూపించని నిందితుడు రవికుమార్ ను తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ఏడుస్తూ ఓ వీడియో చేశారు. దాన్ని వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో రిలీజ్ చేయించారు. ఆ వీడియో చూసి..అయ్యోపాపం ఆయన పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకున్నారని అనుకోవాలని భావన. అలా అనుకునే బదులుగా మరిన్ని అనుమానాలు ప్రజల మనసుల్లో నాటారు దొంగ రవికుమారు.
వంద కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి?
దొరికిపోయిన తర్వాతా తాను పశ్చాత్తాపం చెందానని ఆయన కన్నీరు పెట్టుకుంటున్నారు. అందుకే తమకు ఉన్న ఆస్తుల్లో 90 శాతం శ్రీవారికి రాసిచ్చానని చెబుతున్నారు. కేబుల్ ఆపరేటర్ గా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశానని అందుకే అన్ని ఆస్తులు సంపాదించుకున్నానని చెబుతున్నారు. నిజంగా ఆయన అన్ని ఆస్తులు వ్యాపారాల ద్వారా సంపాదించుకుంటే.. శ్రీవారి హుండీ నగదును దొంగతనం చేయాల్సిన అవసరం ఉంటుందా?. కనీసం అలాంటి ఆలోచన వస్తుందా?. ఆ స్థాయిలో సంపాదించుకున్నవారు ఇంకా దేవుడికి సమర్పిస్తారు కానీ దోచుకోరు. పైగా ఆయన దేవుని సేవలో ఉన్న వ్యక్తి. అంటే ఇక్కడే పెద్ద కుట్ర జరిగిందని అర్థమైపోతుంది.
ఎవరూ లేరని ఎందుకు చెబుతున్నారు.. ప్రాణభయంతోనా?
ఆయన ఆస్తులు ఎవరు రాయించుకున్నారో రికార్డుల్లో ఉంటుంది. ఎవరి పేరున ఆస్తులు బదిలీ అయ్యాయి.. వారు ఎవరికి బినామీ అనేది త్వరలో బయటకు వస్తుంది.కానీ ఇప్పుడే బయటకు వచ్చి..తాను ఎవరికీ ఆస్తులు ఇవ్వలేదని వీడియో రిలీజ్ చేయడం ఎందుకు?. అసలు ఇప్పటి వరకూ ముఖం చూపించడానికి కూడా ఇష్టపడని ఆయన వీడియోఎందుకు రిలీజ్ చేసినట్లు ?. జగన్ రెడ్డి చిన్న చోరీ అని చెప్పిన తర్వాత హిందూ సమాజంలో వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ఆయన గ్యాంగ్.. ఈ రవికుమార్ ను తెరపైకి తెచ్చింది. ఫిర్యాదు దారు సతీష్ కు జరిగింది ఆయన చూశారు కాబట్టి భయంతో వణికిపోతున్నారని అర్థం చేసుకోవచ్చు.
దేవుడ్ని దోపిడీ చేసి రాజకీయ ఆటలా?
జగన్ రెడ్డి .. పరకామణి కేసులో ఎందుకు అంతగా భుజాలు తడుముకుంటున్నారో ఆయనకే తెలియాలి. ఆయన కావాలని ఆ కేసులను నెత్తి మీద వేసుకునేంత అమాయకుడు కాదు. దర్యాప్తు జరిగితే అది తన వద్దకు వస్తుందని ఆయన భయపడుతున్నట్లుగా ఉంది.అందుకే కేసును అడ్డుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. నిందితుడితో డ్రామాలు వేయిస్తున్నారు. అయితే అన్నీ బయటకు రాకుండా ఉండవు.
