ఇండిగో విమానాయాన సంస్థ ప్రయాణికులను టార్చర్ పెడుతోంది. బుక్ చేసుకున్న టిక్కెట్లు అన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు. సర్వీసులన్నీ రద్దు అవుతున్నాయి. దీనికి కారణం ఇండిగో సంస్థ చేతకానితనం. మార్చిన రూల్స్ ను అమలు చేయడానికి ఏడాదిన్నర సమయం ఉన్నా పైలెట్లను నియమించుకోవడానికి బద్దకించి మొదటికే మోసం తెచ్చుకుంది. వారు ఎలా పోయినా పర్వాలేదు కానీ ప్రయాణికుల్ని వేతన పెడుతున్నారు. ఇప్పుడు విమాన ప్రయాణాలు కేవలం డబ్బున్నోళ్లకు కాదు.. మధ్యతరగతి జీవులకూ తప్పడం లేదు. అందుకే.. ఎఫెక్ట్ అన్ని వర్గాల ప్రజలపై పడుతోంది.
సరదాగా తిరగడానికి ఎవరూ విమాన ప్రయాణాలు చేయరు !
విమాన ప్రయాణాలను ఎవరూ సరదాగా తిరగడానికి చేయరు. అత్యంత ముఖ్యమైన పనుల మీదనే అందరూ తిరుగుతారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎన్నో పనుల మీద తిరుగుతారు. అవన్నీ అత్యంత ముఖ్యమైన కుటుంబ, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలే అయి ఉంటాయి. అలాంటి ప్రయాణాల విషయంలో ఇబ్బందులు ఎదురైతే.. వారు ఎంతో నష్టపోతారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో ఉన్న పరిస్థితులు.. అక్కడి ప్రయాణికుల కష్టాల గురించి తెలిస్తే.. గుండె తరుక్కుపోతుంది. కొంత మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు.కొంత మంది ఎంతో విలువైన అవకాశాల్ని మిస్సవుతున్నారు. ఇండిగో వల్ల కొన్ని వేల మంది తమ జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని కోల్పోతున్నారు.
విమాన ప్రయాణం ఇప్పుడు మధ్యతరగతికి కామన్
కొంత కాలం కిందట వరకూ విమానా ప్రయాణాలంటే డబ్బున్నోళ్లకే అనుకుంటారు. కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకూ అందుబాటులోకి వచ్చింది. ఇండిగో సంస్థ పూర్తిగా బడ్జెట్ ఫేర్ ఎయిర్ లైన్స్. అందుకే భారత ప్రయాణికుల మార్కెట్ లో అరవై శాతం ఆ కంపెనీకే ఉంది. అంటే ప్రతి వంద మంది ప్రయాణికుల్లో అరవై మంది ఇండిగో ఫ్లైట్లలోనే ప్రయాణిస్తూ ఉంటారు. ఐటీ ఉద్యోగులు.. వివిధ రంగాల ఉద్యోగులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుకు రాకపోకలు సాగించడం సహజం. ఇంత కాలం కరెక్ట్ .. పంక్చువల్ ఎయిర్ లైన్స్ గా గుర్తింపు పొందిన సంస్థ ప్రజలు ఎంతో నమ్మకం పెంచుకుని టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత నట్టేట ముంచింది. విమానాల రద్దు రద్దు వల్ల కేవలం డబ్బున్నోళ్లవే కాదు.. మధ్యతరగతినీ ఇబ్బంది పెడుతున్నాయి.
డీజీసీఏ తప్పిదమా? ఎయిర్ లైన్స్దా?
పైలట్లపై ఒత్తిడి పడకుండా.. ఎక్కువ విశ్రాంతినిచ్చేలా డీజీసీఏ కొన్ని నిబంధనలు తెచ్చింది. వాటిని అమలు చేయడానికి ఏడాదిన్నర సమయం ఇచ్చింది. మిగతా అన్ని ఎయిర్ లైన్స్ దానికి తగ్గట్లుగా తమ మ్యాన్ పవర్ ను పెంచుకున్నాయి కానీ ఇండిగో మాత్రం నిర్లక్ష్యం చేసింది. అది ఎఫెక్ట్ పడింది. ఇందులో డీజీసీఏ తప్పిదం కూడా ఉంది. ప్రయాణికులను ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయనే భయం వారికి కలిగించినట్లయితే ఇలా చేసి ఉండేవారు కాదు. కానీ భారత వ్యవస్థలో ఎప్పుడైనా సమస్య వచ్చిన తర్వాతనే పరిష్కారాలు వెదుకుతారు.
