ఎలాగైనా అరెస్ట్ కావాలి.. జగన్ కంట్లో పడాలి. ఇప్పుడు వైసీపీ చోటా నేతల టార్గెట్ ఇదే. రాజకీయం అంటే బూతులు అందుకోవడం అన్నట్లుగా చేసే వైసీపీ రాజకీయాల్లో ఇలాంటి వారు బలిపశువులుగా మారి అయినా.. ఏదో ఓ మెట్టు ఎక్కుదామని ప్రయత్నిస్తున్నారు. వెంకటరెడ్డి అనే ముక్కూ ముఖం తెలియని..యూట్యూబ్ చానళ్లలో పిచ్చిపిచ్చిగా అరుస్తూ అదే డిబేట్లు అనుకునే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇదే చాన్స్ అనుకుని వియ్ స్టాండ్ విత్ వెంకటరెడ్డి అని పోస్టర్లు వేసుకున్నారు. చాలా మంది నేతలు స్పందించారు. సాక్షితో పాటు సాక్షి సిస్టర్ చానల్స్..సోషల్ మీడియా వాటికి ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఎక్కువ మంది వైసీపీ నేతలు వెంకటరెడ్డి టార్గెట్ చేరుకున్నారని .. సెటైర్లు వేస్తున్నారు.
అరెస్టు కాకపోతే టీడీపీతో కుమ్మక్కయ్యారని అనుమానించే జగన్
జగన్ రెడ్డికి ఉన్న మానసిక వికృతం గురించి.. వైసీపీలో కొంత కాలం ఉన్న వారందరికీ తెలుసు. వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ఆయనతో పాటు వెళ్లాల్సిన సూరీడు వెళ్లలేదు. మాములుగా అయితే వైఎస్ తో పాటు వెళ్లాల్సిన సూరీడు వెళ్లకపోడవంతో.. ఏదో కుట్ర ఉందని జగన్ అనుమానించారు. అంటే సూరీడు వైఎస్ తో వెళ్లి చచ్చిపోకుండా బయటపడటం అంటే.. అది అనుమానాస్పదం అనుకున్నారు. అప్పట్నుంచి సూరీడ్ని గడప కూడా తొక్కనీయలేదు.అలాంటిది పార్టీ నేతలు ఇప్పుడు అరెస్టు కాకపోతే టీడీపీతో కుమ్మక్కయ్యారని లేకపోతే టీడీపీకి భయపడుతున్నారని అనుకోకుండా ఉండరు. అందుకే ఒక్క సారైనా అరెస్టు కావాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
ఒక్క సారి అయినా అరెస్టు కావాలని చాలా మంది నేతల ప్రయత్నాలు
అంబటి రాంబాబు ఏదైనా పార్టీ కార్యక్రమం పెట్టుకుని ర్యాలీలు నిర్వహిస్తే పోలీసుల మీద రుబాబు చేస్తారు. జగన్ పల్నాడు పర్యటనకు వెళ్లినప్పుడు పోలీసులపై ఆయన చేసిన రుబాబు అందరూ చూశారు. ఆయన టార్గెట్ ఒక్క సారి అయినా అరెస్ట్ అవ్వాలని. కానీ పోలీసులు ఆయన కోరిక తీర్చడం లేదు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక్క సారి అయినా అరెస్టు అయితే జగన్ రెడ్డి తమను నమ్ముతారని.. నెత్తిన పెట్టుకుంటారని అనుకుంటున్నారు. అరెస్టు అయిన వెంకటరెడ్డిది అదే ప్రయత్నం. ఆయన ముఖ్యమంత్రి కుటుంబాన్ని తిట్టి తాను అనుకున్నది సాధించారు. పైగా ఆయన .. వెంకటరెడ్డి కావడంతో ఇక పార్టీలో వీరతాళ్లు వేస్తారని ఆయన సహచరులు చెప్పుకుంటున్నారు.
పోలీసులు చాలా వరకూ నిగ్రహం పాటిస్తున్నారు !
ప్రతీ దానికి అరెస్టులు చేయాలని పోలీసులు అనుకోవడం లేదు. అనవసరంగా పొలిటికల్ మైలేజీలు ఇవ్వాలని అనుకోవడం లేదు. కానీ దారి తప్పుతున్న వారిని దారిలో పెట్టకపోతే పెరిగిపోతారని .. గీత దాటిన వారిపై చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలు, ఫేక్ చేస్తున్న వారిని వదిలి పెట్టకుండా లోపలకు పంపుతున్నారు. తమ టార్గెట్ అరెస్టే అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. ఫేక్ చేస్తే వారి కోరిక తీర్చేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటున్నారు. కానీ వారు మరోసారి అలాంటి ఆలోచన రాకుండా ఉండేలా.. ట్రీట్ మెంట్ కూడా ఇస్తారని అంటున్నారు.
