ఆసీస్ పర్యటనలో టీమ్ ఇండియా టీ20 సిరీస్ ని కైవసం చేసుకుంది. అయిదు మ్యాచుల్లో రెండు వర్షార్పణమయ్యాయి. మూడు మ్యాచుల్లో రెండు నెగ్గిన భారత జట్టు ఈ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ రోజు జరిగిన ఐదో మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆట ఆగే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది.
ఈ దశలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వాతావరణం అంతరాయం కలిగింది. తర్వాత వర్షం కూడా ప్రారంభమైంది. ఆటను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో కాసేపటి తర్వాత అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఈ సిరీస్‌ను టీమ్ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.
నిజానికి భారత్ కి వర్షం ఎప్పుడూ కలిసిరాదు. డక్‌వర్త్ లూయిస్ రూల్ ప్రకారం భారత్ ఓడిపోయిన మ్యాచులే ఎక్కువ. గెలవాల్సిన స్థితిలో వర్షం కారణంగా ఓడిపోయిన మ్యాచులు అనేకం.
ఈ టూర్ లో వన్డే సిరిస్ వర్షం కారణంగానే కోల్పోవాల్సివచ్చింది. తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ కి దిగిన ఇండియా వర్షం కారణం.. సగం ఆట అయ్యేసరికి ఓవర్స్ కుదింపు కారణంగా టీ20 తరహాలో అడాల్సింది వచ్చింది. తర్వాత చేజ్ కి దిగిన ఆసీస్ కి ఈజీ అయిపొయింది. అలా ఫస్ట్ మ్యాచ్ కోల్పోయి వెనకబడిపోయింది ఇండియా.
కాకపొతే టీ20 సిరిస్ లో వర్షం భారత్ కి పూర్తిగా అనుకూలించింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. మరో మ్యాచ్ లో గెలిచి లీడ్ కి వచ్చింది ఆసీస్. తర్వాత ఇండియా రెండు వరుసగా గెలిచింది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచి సిరిస్ ని లెవెల్ చేయాలని చూసిన ఆసీస్ ఆశలపై వరుణుడు నీళ్ళు చల్లాడు. మొత్తానికి ఈ టూర్ లో వరుణుడు రెండు జట్లకు సమన్యాయం చేశాడు.
