ఎమ్మెల్యేలుగా ఎన్నికయి ప్రజలకు అందుబాటులో లేకుండా.. ఉన్నా ప్రజల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న 48 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వారికి నోటీసులు జారీ చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయవర్గాలను ఆదేశించారు. చంద్రబాబు సాధారణంగా ఎమ్మెల్యేల గురించి ఇంత సరియస్ అవరు. కానీ ఇవాళ నోటీసుల వరకూ వెళ్లడానికి కారణాలు ఉన్నాయి.
ఈ ఎమ్మెల్యేలు నేరుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధంగా లేరు. 48 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికం.. తమ నియోజకవర్గంలోని ప్రజలకు వచ్చిన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా పంపిణీ చేయడం లేదు. ఆ చెక్కుల గడువు తీరిపోయే వరకూ వారి వద్దనే ఉంటున్నాయి. తర్వాత వెనక్కి వస్తున్నయి. అలాగే చంద్రబాబు ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. కానీ పాల్గొనడం లేదు.
ఇలా నేరుగా ప్రజలతో ఉండే కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా సమయం లేని ఎమ్మెల్యేలను ఉపేక్షించడం మంచిది కాదని చంద్రబాబు డిసైడయ్యారు. వీరందరి పేర్లు రికార్డుల్లోకి ఎక్కించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలకు ఇది మొదటి వార్నింగ్ మాత్రమే కాదని.. ఇప్పటికీ సరిదిద్దుకోకపోతే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటారన్న సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబు కూడా ఈ ఎమ్మెల్యేల పట్ల ఏ మాత్రం కనికరం చూపకుండా.. కఠినంగా ఉండాలని క్యాడర్ కోరుకుంటున్నారు.
