H1B వీసాకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలని.. ఇంకా కఠినమైన రూల్స్ పెడతామని ట్రంప్ బెదిరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన రూల్స్ లో ఇంకా సరళతరం చేశారు. ఫలితంగా భారతీయులకు హెచ్‌వన్‌బీ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అమెరికా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం… ఫీజు అమెరికా వెలుపలి అప్లికెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశంలోని విద్యార్థులు, ప్రస్తుత వీసా హోల్డర్లు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. USCIS అధికారిక వెబ్సైట్లో ప్రచురించిన మార్గదర్శకాల్లో, ఈ ఫీజు ఎప్పుడు, ఎవరికి వర్తిస్తుందో స్పష్టంగా తెలిపారు.
సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసిన కొత్త హెచ్-1బీ పెటిషన్లు, అమెరికా వెలుపల ఉన్న , చెల్లుబాటు అయ్యే ఎచ్-1బీ వీసా లేని అభ్యర్థులకు వర్తిస్తుంది. భారత్, చైనా వంటి దేశాల్లో ఉండి కొత్తగా అప్లై చేస్తున్నవారికి ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు ఒక్కసారి మాత్రమే చెల్లించాలి. ఇది పెటిషన్ దాఖలుకు మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హెచ్-1బీ వీసా ఉన్నవారు, లేదా సెప్టెంబర్ 21 ముందు దాఖలు చేసిన పెటిషన్లకు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. అమెరికాలో ఉండి స్టేటస్ మార్పు, అమెండ్మెంట్ లేదా ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయినవారికి ఫీజు అక్కర్లేదు. . ఉదాహరణకు F-1 విద్యార్థి వీసా నుంచి ఎచ్-1బీకి మారేవారికి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. చేంజ్ ఆఫ్ స్టేటస్ – COS కేటగిరి కిందకు వస్తుంది. ప్రస్తుత ఎచ్-1బీ హోల్డర్లు దేశాన్ని వదిలి మళ్లీ ప్రవేశించడానికి ఎటువంటి పరిమితులు లేవు. అలాగే, అప్రూవ్ అయిన పెటిషన్ ఆధారంగా వీసా స్టాంపింగ్ చేసుకుని తిరిగి రావడం కూడా ఫ్రీ. 2025 లాటరీ విన్నర్లకూ ఫీజు వర్తించదు.
సాధారణంగా భారతీయులు ఎక్కువగా అమెరికాలో చదువుకుని అక్కడి కంపెనీల ద్వారా హెచ్ వన్ బీ పొందుతారు. భారత్ లో ఉండి.. హెచ్‌వన్‌బీ పొందేవారు చాలా తక్కువగా ఉంటారు. అందుకే రిలీఫ్‌గా భావిస్తున్నారు.
