హనుమాన్, మిరాయ్ సినిమాలతో వరుసగా రెండు మెగా బ్లాక్ బస్టర్లు కొట్టాడు తేజా సజ్జా. మిరాయ్ రూ.150 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈరోజు భారీ సక్సెస్ మీట్ నిర్వహించబోతోంది టీమ్. ఈ సందర్భంగా తేజా సజ్జా తదుపరి సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.
తెలుగులో జాంబి జోనర్‌ని పరిచయం చేసిన సినిమా.. ‘జాంబీరెడ్డి’. ఈ సినిమాతోనే తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబో సెట్ అయ్యింది. ఇప్పుడు జాంబిరెడ్డి 2 రాబోతోంది. తేజా సజ్జానే హీరో. కాకపోతే దర్శకుడు మారే అవకాశం ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కొంత సమయం ఉంది. అయితే ఈలోగా జాంబిరెడ్డి ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం. దాదాపు రూ.42 కోట్లకు ఓటీటీ హక్కుల్ని ఓ సంస్థ సొంతం చేసుకొందని సమాచారం. మీడియం రేంజ్ సినిమాలకు ఇది చాలా పెద్ద మొత్తమనే చెప్పాలి. కొబ్బరికాయ కొట్టకుండానే ఓటీటీ డీల్ క్లోజ్ చేయడం ఈరోజుల్లో సాధారణమైన విషయం కాదు. వరుసగా రెండు విజయాలతో తేజా సజ్జా సంపాదించుకొన్న నమ్మకం ఇది.
‘జాంబిరెడ్డి’ బడ్జెట్ అటూ ఇటుగా రూ.10 కోట్ల లోపే. కానీ ఈసారి బడ్జెట్ బాగా పెరగబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తారు. సెటప్ కూడా చాలా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. హిందీ మార్కెట్ పై ఇంకా బాగా ఫోకస్ చేసి, అక్కడ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయాలన్నది ప్లాన్. జాంబీ కథలు ఎక్కడైనా వర్కవుట్ అవుతాయి. ఇలాంటి జోనర్‌కి బాషాబేధం లేదు. అందుకే హిందీ నుంచి కూడా ఈ సినిమాకు క్రేజీ ఆఫర్ అందే అవకాశాలున్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. `మిరాయ్`తో కాస్త గాడిన పడిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇప్పుడు ఈ జాంబీరెడ్డితో మరింత ఊపిరి తీసుకొనే అవకాశం వుంది.
