మిత్రుల్ని దూరం చేసుకుని రోడ్డు మీద పడటంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు తమిళనాడులో అదే పని చేస్తోంది. మంచి స్నేహ బంధం ఉన్న డీఎంకేను చిరాకుపెడుతోంది. విజయ్‌తో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయన మీద అవసరం లేని సాఫ్ట్ కార్నర్ చూపిస్తూండటంతో డీఎంకే నేతలు కాంగ్రెస్ కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు.
విజయ్‌కు ఫోన్ చేసిన రాహుల్ గాంధీ
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేశారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. విదేశాల్లో ఉన్న రాహుల్.. టీవీకే అధ్యక్షుడికి ఫోన్ చేసి .. పరామర్శించారని అంటున్నారు. అసలు ఆయనే ఆరోపణలు ఎదుర్కొంటూంటే ఆయనకు ఫోన్ చేసి..పరామర్శించి రాహుల్ ధైర్యం చెప్పడం ఏమిటన్న విస్మయం డీఎంకేలో వ్యక్తమయింది. అయితే నిజంగా ఫోన్ చేశారా లేదా అన్నది అధికారికంగా తెలియకపోవడంతో డీఎంకే స్పందించలేదు. కానీ రాహుల్ ఫోన్ చేశారని.. డీఎంకే అగ్రనేతలకు సమాచారం ఉంది.
కాంగ్రెస్, డీఎంకే కూటమిని శత్రువుగా ప్రకటించిన విజయ్
టీవీకే అధ్యక్షుడు విజయ్.. డీఎంకే, కాంగ్రెస్ కూటమిని రాజకీయ శత్రువుగా ప్రకటించుకున్నారు. మొదటి నుంచి ఆ కూటమినే టార్గెట్ చేస్తున్నారు. అన్నాడీఎంకేను ఏమీ అనడం లేదు. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించుకున్నారు. అదే సమయంలో కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత డీఎంకే కూటమి ఈ అవకాశాన్ని పక్కాగా వినియోగించుకుంటోంది. ఈ ఘటనలో.. విజయ్ ఎంత తప్పిదం చేశారో ప్రజలకు వివరించేందుకు పక్కాగానే వ్యవహరిస్తోంది. ఆయన తప్పుల్ని బయట పెట్టడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. విజయ్ తప్పు చేశాడని అందరికీ చెబుతోంది. కానీ కాంగ్రెస్ విజయ్ పై సానుభూతి వ్యక్తం చేయడం మాత్రం సమస్యగా మారింది.
కాంగ్రెస్ తీరుపై స్టాలిన్ అసహనం
స్టాలిన్ ను దూరం పెట్టి విజయ్ తో కాంగ్రెస్ పార్టీ వెళ్లాలనే ఆలోచన చేస్తోందా లేకపోతే ఎక్కువ సీట్ల కోసం స్టాలిన్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ పద్దతిని పాటిస్తోందా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఇలా చేయడం కూటమి పార్టీల మధ్య ఉన్న విశ్వాసం తగ్గిపోవడానికి కారణం అవుతుంది. అది కాంగ్రెస్ భస్మాసుర హస్త రాజకీయాల వల్లే జరుగుతోంది. స్టాలిన్ ఇక నుంచి కాంగ్రెస్ విషయంలో గతంలోలా ఏకపక్షంగా మద్దతుగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
