అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతిని దేశం మొత్తం ఘనంగా నిర్వహించుకుంటుంది. అందరూ గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలను పాటించాలని పిలుపునిస్తారు. మహాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడాలన్న ఆలోచన కూడా ఎవరికీ వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన విధానాలు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టాయని అందరూ నమ్ముతారు. కానీ సోషల్ మీడియా విజృంభణ తర్వాత జాతిపితపై వ్యతిరేక భావం పెరిగేలా చేస్తున్నారు కొందరు. భావజాలం వ్యతిరేకమని ఆయనపై విషం చిమ్మేస్తున్నారు.
గాంధీ జయంతి రోజున ఈ మార్పు ఈ సారి మరింత ఎక్కువగా ఉంది. ఆయన జయంతికి శుభాకాంక్షలు చెప్పేవారి కన్నా.. విమర్శిస్తూ ,ద్వేషిస్తూ ట్వీట్లు పెట్టేవారు ఎక్కువయ్యారు. ఈ మార్పు అనూహ్యంగా కనిపిస్తోంది. చాలా మంది గాడ్సేను పొగుడుతూ తమ అభిప్రాయం చెప్పడం మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుంది. చరిత్రను వక్రీకరించుకుంటున్న ఫలితమే ఇదంతా అని గాంధీ మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఏం జరిగిందో.. మనకు పాఠ్యపుస్తకాల ద్వారా చెప్పారు. అప్పట్లో గాంధీ చెప్పిన అహింసా సిద్ధాంతం ఇప్పుడు పనికి రాదని చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు పనికి రాకపోవచ్చు కానీ అప్పట్లో లక్షల మంది భారతీయులు హింస కారణంగా చనిపోకుండా కాపాడిన సిద్ధాంతం అది. గాంధీ మహాత్ముడ్ని ప్రపంచదేశాలు అభిమానిస్తాయి. కానీ మన దేశంలో మాత్రం వ్యతిరేకత ఇప్పుడు పెంచుకోవడం మాత్రం అనూహ్యమే. ఏమీ తెలియని తరానికి ఆయన చెప్పినవి వింతగా అనిపిస్తున్నాయి. వ్యతిరేక, హింసాత్మక భావజాలంతో వ్యతిరేకత పెంచుకుంటున్నారు. ఎంత ఘోరం అంటే.. హత్య చేసిన గాడ్సెను పొగుడుతున్నారు. ఇది దేశ వారసత్వానికి ప్రమాదకరం. ఇలాంటి వాటిని తగ్గించకపోతే దేశ ఇమేజ్‌పైనే మరకపడే ప్రమాదం ఉంది.
