బీహార్‌లో జోరుగా రాజకీయం చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు వస్తూండటంతో తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చింది. తన మూడేళ్ల ఆదాయ వివరాలను ఆయన వెల్లడించారు. తాను కంపెనీలకు, రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చి.. మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించానని ప్రకటించారు. 2021 నుంచి 2024 వరకూ ఆయన సంపాదన ఇది. అంతకు ముందు ఐ ప్యాక్ లో భాగంగా ఉండేవారు కానీ తర్వాత సొంతగా ఏ సంస్థను పెట్టుకోకుండానే వ్యక్తిగతంగా సేవలు అందించారు.
ఓ సందర్భంలో రెండు గంటలు మాట్లాడినందుకు రూ. 11కోట్లు వసూలు చేశానని తెలిపారు. ఆ డబ్బుల్లో 90 కోట్లు తన జనసురాజ్ పార్టీ కోసం విరాళం ఇచ్చానని ఆ డబ్బతోనే పార్టీ నడుస్తోందని చెప్పారు.తాను దొంగతనం చేయలేదని సలహాలిచ్చి డబ్బు సంపాదించానని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ కు ఇంత భారీగా ఎవరు డబ్బులిచ్చారన్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన సేవలు అందించిన పార్టీలు, సంస్థలేవో పెద్దగా బయటకు రాలేదు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కోసం ఆయన పని చేశారు. కానీ ఎక్కువ కాలం ఆ పార్టనర్ షిప్ ఉండలేదు. వెంటనే మారిపోయారు. ఐ ప్యాక్ కంపెనీ అయితే ఏపీలో వైసీపీకి పని చేసింది. దాంతో ఆయనకు సంబంధం లేదని.. ఆయన ఓ సారి చంద్రబాబుతో సమావేశం అవడం ద్వారా క్లారిటీ వచ్చింది. కానీ టీడీపీకి ఆయన స్ట్రాటజిస్టుగా పని చేయలేదు. రాబిన్ సింగ్ అనే పీకే సహచరుడే పని చేశారు. అయితే లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పార్టీలకు.. వ్యక్తులకు సలహాలిచ్చి సంపాదించి ఉంటారని భావిస్తున్నారు. ఇటీవల విజయ్ పార్టీకి పని చేస్తారని అనుకున్నా.. ఆయన వైదొలిగారు.
