రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు మూసి నది విశ్వరూపం చూపిస్తోంది. ఆక్రమణలు పోగా మిగిలిన కాలువ అంతటి ప్రాంతాల్లో నీరు సరిపోక కాలనీల్లోకి నీరు వచ్చేసింది. ఇది చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షం పడితే వచ్చిన వరద కాదు.. తుంపర్లు.. అప్పుడప్పుడూ పడిన భారీ వర్షాల వల్ల మాత్రమే వరద వచ్చింది. ఇక రికార్డు స్థాయి వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసినదిని దశాబ్దాల పాటు నిర్లక్ష్యం చేసి .. డ్రైనేజీ కాలువలా మార్చారు. చాలా మంది ఆక్రమించి కాలనీలు కట్టేశారు. ప్రభుత్వాలు మూసీనదిని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయడానికి ప్రణాళికలు ప్రకటిస్తాయి కానీ అడుగు ముందుకు పడదు. ఎస్టీపీలు నిర్మిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్లు వేసింది. కానీ ఎస్టీపీలతో మాత్రమే పని కాదని మూసిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తాజా వరదలు నిరూపిస్తున్నాయి.
ఓ మాదిరి వర్షం కురిస్తే మూసారా బాగ్ నుంచి ఎంజీబీఎస్ వంతెన వరకూ నీళ్లు పైకి వచ్చేస్తున్నాయి. ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్రమణలు తొలగించి.. పూర్తి స్థాయిలో నదిని మళ్లీ పునరుద్ధరిస్తేనే మూసీకి మళ్లీ మంచి రోజులు వస్తాయి. డ్రైనేజీ మూసీలో కలవకుండా జాగ్రత్తలు తీసుకుని ..రేవంత్ రెడ్డి ఓ ప్రణాళికను అమలు చేయాలనుకున్నారు. కానీ ఆర్థిక సమస్యలు.. ఆక్రమణదారుల్ని రెచ్చగొట్టడం వంటి వాటి ద్వారా ఆలస్యం అవుతోంది. కానీ మూసి పునరుద్ధరణ చేసి తీరుతానని రేవంత్ అంటున్నారు. అది ఎంత అవసరమో ఇప్పుడు ఉన్న పరిస్థితులు నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో రేవంత్ కు మద్దతు పెరిగే అవకాశం ఉంది.
