మాజీ మంత్రి వెల్లంపల్లి తాను ఏదో కోల్పోతున్నట్లుగా అల్లాడిపోతున్నారు. రోజూ ప్రెస్మీట్లు పెట్టి విజయవాడ ఉత్సవ్ మీద కోట్ల కొద్దీ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణల విలువ కనీసం వెయ్యి కోట్ల వరకూ ఉంటుంది. విజయవాడ ఉత్సవ్ పేరుతో అంత జరుగుతోందా.. అని అందరూ ఆశ్చర్యపోయేలా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ఇలా వెల్లంపల్లి ఆవేశపడిపోతున్నారో చాలా మందికి అర్థమైపోతుంది. ఉత్సవాల కమిటీ ఆయనను మర్చిపోయి..ఆయన అడిగిందేదో చేయలేదని.. అందుకే ఇలా అంటున్నారని ఆయన అనుచరులు కూడా గొణుక్కుంటున్నారు.
విజయవాడ ఉత్సవ్ అనేది ఏ ఒక్కరో చేస్తున్నది కాదు. ప్రజాప్రతినిధులంతా గ్రూపుగా ఏర్పడి బాధ్యతలు తీసుకుని దసరా పండుగ సందర్భంగా నిజమైన పండుగ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద కళాకారులను తీసుకు వస్తున్నారు. అయితే స్టాల్స్.. ఇతర వాటికి లక్షల్లో వసూలు చేస్తున్నారని.. కోట్ల రూపాయల ఫీజులు సంపాదించుకుంటున్నారని ఇలా వెల్లంపల్లి ఆరోపణలు చేస్తున్నారు.అక్కడ అంత లేదని ప్రజలకు ఉచితంగానే ఎంటర్ టెయిన్ మెంట్ అందుతోందని అటు వైపు వెళ్లిన వాళ్లకు కాస్త క్లారిటీ ఉంది.
వెల్లంపల్లి దందాలు ఎలాంటివో గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గంలో ప్రజలందరూ గుర్తు చేసుకుంటారు. ప్రతి ఒక్క వ్యాపారి దగ్గర ఆయన కమిషన్లు వసూలు చేసేవారు. ఇప్పుడు పదవి పోయింది.. ప్రభుత్వం పోయింది అయినా.. విజయవాడ ఉత్సవ్ నుంచి కూడా తనకు అలాంటివి అందాలని కోరుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కోర్టుల్లో పిటిషన్లు వేసి ఆపుతానని బెదిరిస్తున్నారు. ఈ ఉత్సవాల వల్ల దుర్గ గుడికి ఉత్సవాలను ఎవరూ పట్టించుకోరన్న విచిత్ర వాదనను కూడా ఆయన తెరమీదకు తెచ్చారంటే.. ఎంత అల్లాడిపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన బాధ ఆయనది.
