అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సందీప్‌రెడ్డి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయనకు భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్లోనే సందీప్ ఇప్పుడు ఓ చిన్న సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన వేణుని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్‌ని హీరోగా ఎంచుకొన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. త్వరలోనే.. హీరోయిన్ని ఫిక్స్ చేస్తారు. సందీప్ రెడ్డి నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా ఆ సినిమా వైపు చూస్తుంది చిత్రసీమ. హీరో, హీరోయిన్లు ఎవరైనా, దర్శకుడి పేరు ఎవరిది ఉన్నా, సందీప్ ముద్ర కచ్చితంగా ఆ సినిమాపై ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కూడా అందరి దృష్టినీ ఆకర్షించే అవకాశం ఉంది.
మరోవైపు స్పిరిట్ కి సంబంధించిన పనులన్నీ చక్కబెట్టుకొంటున్నారు సందీప్. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయ్యిందని టాక్. ఈ యేడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కుతుంది.
