జూబ్లిహిల్స్ ఉపఎన్నిక అనివార్యం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నోటిఫికేషన్ రావడం ఖాయం. దీనిపై స్పష్టత ఉంది కాబట్టి బీఆర్ఎస్ చాలా పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి మాగంటి సునీతకే చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ప్రకటించకపోయినా.. అనధికారికంగా క్లారిటీ ఇచ్చింది. దాంతో ఆమె జూబ్లిహిల్స్ లో ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అ పార్టీలో పేర్లు ఎక్కుువగా ప్రచారంలోకి రావు. కానీ కాంగ్రెస్ పార్టీదే భిన్నమైన రాజకీయం. ఆ పార్టీలో ఎక్కడెక్కడి నేతలంతా రేసులోకొచ్చేస్తారు. గందరగోళానికి కారణం అవుతారు. ఇప్పుడు అదే జరుగుతోంది.
దానం నుంచి అంజన్న వరకూ అందరూ అభ్యర్థులే
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తుందన్న నమ్మకంతో ఉన్న నేతలు.. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి గెలుపు బాధ్యతను తీసుకుంటారు. టిక్కెట్ వస్తే చాలు తమ పనేమీ ఉండదని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ తగ్గడం లేదు. అందరూ తాము రేసులో ఉన్నామంటున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నుంచి ఎమ్మెల్యే దానం పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎప్పుడో యాభై ఏళ్ల కింద మంత్రిగా చేసిన లీడర్ కుమార్తె కూడా నేనున్నా అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గందరగోళంలో పడుతోంది.
నామినేషన్ల చివరి రోజు అభ్యర్థిని ప్రకటిస్తే జరిగే నష్టం చాలా ఎక్కువ !
కాంగ్రెస్ పార్టీలో ఓ సంప్రదాయం ఉంది. దాని ప్రకారం.. అభ్యర్థిని చివరి క్షణం వరకూ ప్రకటించరు. అందరికీ ఆశ చూపిస్తారు. చివరికి టిక్కెట్ దక్కిన ఒక్కరు తప్ప అందరూ అసంతృప్తికి గురై పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తారు. తప్పని ఎన్నిక అని తెలిసినప్పుడు ముందుగానే అభ్యర్థిపై అందరికీ క్లారిటీ ఇస్తే మిగిలిన వాళ్లు ఆశలు పెట్టుకోరు. కానీ అలాంటి పనులు మాత్రం చేయలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి .. నవీన్ యాదవ్ ను అభ్యర్థిని పెట్టాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఆయనే అభ్యర్థి అవుతారని గట్టి సంకేతాలను ఇస్తే మిగిలిన వాళ్లు సైలెంట్ అవుతారు. కానీ ఆ పని కూడా చేయలేకపోతున్నారు.
తేడావస్తే కాంగ్రెస్ కు మైనస్సే!
ఉపఎన్నికల్లో అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ ఉంటుంది.కానీ ఈ ఎన్నిక జరుగుతోంది..సిటీలో. అది కూడా జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో . అందుకే సెంటిమెంట్లు, పార్టీల బలాబలాలు పని చేయవు. రాజకీయ వ్యూహాలే కీలకం. ఈ విషయంలో కాంగ్రెస్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ అంతా హైకమాండ్ ఆదేశాల మీదనే జరగాల్సి ఉండటంతో.. ఏ నిర్ణయానికీ క్లారిటీ లేకుండా పోతోంది.
