ఫ్యాన్స్ ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో ఎట్టకేలకు సెట్ అయ్యింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబరు 6 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. త్రిష, మీనాక్షి చౌదరి… ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. చివరికి శ్రీనిధి శెట్టిని ఓకే చేసినట్టు సమాచారం అందుతోంది.
గుంటూరు కారం తరవాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. దానికి కారణం.. అల్లు అర్జున్. గుంటూరు కారం అవ్వగానే బన్నీతో ఓ సినిమా చేద్దామనుకొన్నారు. కొంత వర్క్ కూడా జరిగింది. కానీ ఎందుకో…ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తరవాత అదే కథ ఎన్టీఆర్‌కి సెట్ చేశారు త్రివిక్రమ్. అయితే ఎన్టీఆర్ తన ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. దీంతో ఈ గ్యాప్ లో వెంకీ సినిమా మొదలెట్టాలని భావించారు. కొంతకాలంగా ఆ పనులమీదే త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు.
ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. టైటిల్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేయించేశారని టాక్. టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.
