వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్ రద్దు పిటిషన్లు మళ్లీ ట్రయల్ కోర్టుకు చేరుకోనున్నాయి. ప్రస్తుత దశలో బెయిల్స్‌ను రద్దు చేయలేమని ఇందు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు వైఎస్ సునీతకు సూచించింది . నిందితులు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని వారు బెయిళ్లను రద్దు చేసి వేగంగా దర్యాప్తు చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
గత విచారణల సందర్భంగా సుప్రీంకోర్టు ఎంత మంది బెయిల్స్ రద్దు చేయాలి, విచారణ కొనసాగించాలా వద్దా అన్నది చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దర్యాప్తును ప్రభావితం చేసిందని.. అధికార దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు సునీతారెడ్డి, ఆమె భర్తపై పెట్టిన కేసులను క్వాష్ చేసింది. దీంతో కఠినమైన నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంటుందని వివేకా హత్య కేసు నిందితులు టెన్షన్ పడ్డారు.
అయితే విచారణ తర్వాత సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆశ్రయించమని సూచించింది. తదుపరి దర్యాప్తు కోసం కూడా ట్రయల్ కోర్టునే ఆశ్రయించాల్సి ఉంది. దీంతో సునీత ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు ఆదేశిస్తే.. దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది.
