హనుమాన్, మిరాయ్… ఇలా బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నాడు తేజా సజ్జా. తనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇప్పుడు పోటీ పడుతున్నారు. త్వరలోనే ‘జాంబిరెడ్డి 2’ మొదలు కాబోతోంది. `మిరాయ్ 2` పట్టాలెక్కించే ఆలోచనలు ఉన్నాయి. `జై హనుమాన్` స్క్రిప్టు ఎలానూ ఉంది. ఇప్పుడు వీటితో పాటుగా మరో సినిమా మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు తేజ.
దర్శకుడు మల్లిక్ తో కలిసి తేజా ఓ సినిమా చేయబోతున్నాడు. మల్లిక్, తేజా ఇద్దరూ మంచి స్నేహితులే. వీరిద్దరి కాంబినేషన్లో ‘అద్భుతం’ అనే సినిమా వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా విడుదల కాలేదు. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడితో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు తేజా. తన కథలన్నీ వెరైటీగా ఉంటాయి. అందులో దేవుడికి సంబంధించిన అంశం కచ్చితంగా ఉంటుంది. ఈసారి కూడా అలాంటి కథే చేస్తున్నాడట. సోషియో ఫాంటసీ మిక్స్ చేసిన ఈ కథలో, గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేస్తున్నారని, ఈ కథ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందిస్తారని తెలుస్తోంది. `జాంబి రెడ్డి 2` చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. మరి ఈ సోషియో ఫాంటసీ కథకు నిర్మాతలెవరో తేలాలి.
