వైసీపీ నాయకత్వం మళ్లీ తమను నమ్మిన క్యాడర్ ను బలి పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సోషల్ మీడియాలో వైసీపీ కోసం పని చేసే వారిని ఇటీవల కొంత మందిని సమీకరించుకుంది. వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు టెక్నికల్‌గా వారి ఆచూకీ తెలియకుండా చూసేందుకు ఏర్పాట్లు చేసింది. కొంత మంది ఇతర దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారినీ కూడా జీతానికి మాట్లాడుకున్నట్లుగా వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. వీరందరి సాయంతో పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారాలు, బూతులతో విరుచుకుపడేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది.
పెరుగుతున్న వైసీపీ ఫేక్ ప్రచారాలు
వైసీపీ సోషల్ మీడియా గత కొద్దిరోజుల నుంచి రెచ్చిపోతోంది. ఏదోక వీడియో తీసుకు వచ్చి.. ఏపీలో ఇలా జరిగిపోతోందని ఒకడు పోస్టు చేయడం..దాన్ని వైసీపీ వాళ్లు షేర్లు చేయడం..కామెంట్ చేయడం క్రమంగా పెరిగిపోతోంది. హైదరాబాద్ ఆటోవాలాల వీడియోలు, ఆదిలాబాద్ మహిళల బస్సులో ఫైటింగ్ వీడియోలు తీసుకు వచ్చి.. ఏపీలో జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. చివరికి ఎక్కడో జరిగిన వీడియో తీసుకు వచ్చి.. అందులో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ఉన్నాడని ఆయనేం పోలీస్ అని తిట్టడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు క్రమంగా పెరిగిపోతోంది. ప్రతీ దానికి వివరణ ఇచ్చుకోవడం అసాధ్యం.
ఫేక్ కోసం వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్న వైసీపీ
కానీ పోలీసులు మాత్రం ఇలాంటి వారిని అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా కోసం వైసీపీ వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కొంతమందిని దుబాయ్ లాంటి ప్రాంతాలకు పంపేసి.. అక్కడే వసతి ఏర్పాటు చేసి.. ఈ పోస్టులు పెట్టిస్తున్నారు. కానీ వైసీపీ ఎంత చేసినా వారి జీవితాలతో ఆడుకున్నట్లే. ఈ రోజుల్లో విదేశాల్లో ఉండి.. తప్పుడు పోస్టులు పెట్టి.. తమను పట్టుకోలేరు అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదు. తీవ్రంగా ఇబ్బందిపడేది ఇవాళ కాకపోతే రేపైనా ఆ క్యాడరే.
వారందరి జీవితాలు, కుటుంబాలను జగన్ కోసం బలి పెడుతున్నట్లే !
వైసీపీ కోసం ఫేక్ ప్రచారాలు చేసే వారు కూడా జగన్ రెడ్డి తమను తన స్వార్థం కోసం బలి ఇచ్చేందుకు ఇలా చేస్తున్నారని గుర్తించాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటాయి. అందులోనూ జగన్ లాంటి వాళ్లు ఇంకా ఘోరం. ఏదైనా తప్పు జరిగితే.. అతడితో తమకు సంబంధం లేదని వాడు టీడీపీ వాడని అనేస్తారు. గతంలో జడ్జిలను వ్యవస్థీకృతంగా తిట్టించి..తర్వాత బెయిల్స్ కూడా ఇప్పించలేకపోయారు. అలా బాధపడిన వారిలో కొంత మంది కుటుంబాల పరంగా ఎంత దెబ్బతిన్నారో అందరికీ తెలుసు. శ్యామ్ కలకడ,అజయ్ అమృత్ లాంటి వాళ్లను వైసీపీ కాటు వేసింది. ఇప్పుడు మరోసారి డబ్బుల కోసం వైసీపీ ఫేక్ ప్రచారాలను మోసేందుకు కొంత మంది ముందుకు వచ్చారు. వారందర్నీ జగన్ బకరాలను చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
