వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లకపోవడం రాజకీయాల గురించి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారనేది వారి డౌట్ . ఎందుకంటే ప్రజా స్వామ్యంలో అసెంబ్లీలో చేసే పోరాటమే రికార్డెడ్. నేను ట్వీట్లతో ప్రశ్నించా.. ప్రెస్మీట్లో ప్రశ్నించా.. రోడ్డెక్కి షోలు చేశా అంటే అదంతా రాజకీయ డ్రామాలు అవుతాయి. కానీ అసలు ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అది అసెంబ్లీలోనే.
ప్రతిపక్ష హోదా ప్రోటోకాల్ మాత్రమే !
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది ..ప్రోటోకాల్ కోసం మాత్రమే. దాని వల్ల ప్రభుత్వంపై పోరాడటానికి అదనపు బలం రాదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం స్పీకర్ సభ్యుల సంఖ్య ప్రకారం మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తారు. ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఉందా లేదాఅన్నది చూడరు. కానీ ఏపీ అసెంబ్లీలో ఉన్న ప్రత్యేక పరిస్థితులలో జగన్ అసెంబ్లీకి హాజరైతే.. ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం వస్తుంది. ప్రభుత్వం ఏకపక్షంగా సభ నిర్వహించుకోవాలని అనుకోదు. ప్రజల్ని దృష్టిలో పెట్టుకుంటుంది. అందుకే జగన్ అసెంబ్లీకి హాజరవడం మంచిదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
చట్టసభలపై నమ్మకం లేని రాజకీయ నాయకుడు
చట్టసభలపై జగన్కు ఏ మాత్రం నమ్మకం లేదని ఆయన రాజకీయాలను చూస్తే అర్థమవుతోంది. గతంలో తాను పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు కూడా ఎవర్నీ అసెంబ్లీకి పోనివ్వలేదు. గతంలో పార్టీల అధినేతలు అసెంబ్లీ బహిష్కరించినా తమ పార్టీ తరపున పోరాటం మాత్రం ఆపలేదు. కానీ జగన్ రెడ్డిలో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. తమ పార్టీ తరపున ఎవరైనా గట్టిగా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి గుర్తింపు తెచ్చుకుంటే సహించలేరు. జగన్ రెడ్డి కంటే బాగా మాట్లాడతారన్న భావన వచ్చే నేతల్ని ఆయన ఉండనీయరు.
అధికారంలో ఉన్నప్పుడూ చట్టసభలకు అవమానమే !
అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా చట్టసభల పట్ల ఆయనకు ఏ మాత్రం గౌరవం లేదన్న విషయం తేటతెల్లం చేస్తుంది. ప్రతిపక్ష నేతల్ని అత్యంత ఘోరంగా సభలో వేధించారు. ఇతర సభ్యులతో బూతులు తిట్టించారు. అవన్నీ వింటూ చిద్వాలాసంగా గడిపారు. ఆయన తీరుతో సభపై ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఓడిపోయే సరికి అలాంటి అసెంబ్లీకి వచ్చేందుకు ఆయన వెనుకడుగు వేస్తున్నారు.
